కార్తీక దీపము - Endless flame of light
కార్తీక దీపము
కార్తీకపౌర్ణమి సాయం సమయంలో ప్రమిదలలో చమురు పోసి, దీపములు వెలిగించే ఆచారము భారత దేశమంతా ఉంది. ప్రతి యింటి వాకిటి ముందు ఈ దీపాల వరుస మినుకు మినుకు మంటూ కనిపిస్తుంది. ఈరోజున కనీసము ఒక దీపమైనా ఇంటింట వెలిగిస్తారు.
కార్తీకమాసం అనగానే వనభోజనాలు, ఉపవాసాలు, నదీస్నానం వంటి ఆచారాలతో పాటు దీపం వెలిగిస్తాం. ఈ దీపం వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకము చెబుతాము. ఆ శ్లోకానికి అర్థము- ”ఈ రోజున ఎవరీ దీపమున ఆవాహన చేసి, భగవంతుని స్మరిస్తూ, దీప దర్శనం చేస్తారో- ఈ దీపజ్యోతి ఎవరిమీద ప్రసరిస్తుందో వారు, పాప విముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందుతారు.
కృత్తికానక్షత్రము:
ఈరోజు దీపములో దామోదరుడు, ఈశ్వరుడు, త్య్రంబకుడు... మొదలైన దేవతలను ఆవాహనచేసి ప్రార్థిస్తారు. ఇది సంప్రదాయము. కృత్తికా నక్షత్రము, పూర్ణిమతిథి - రెండూ ఈరోజు కలిసి వస్తున్నాయి. దేవాలయాలకు కృత్తికా నక్షత్రమే ముఖ్యము.
తిరువణ్ణామలైలో కృత్తికా నక్షత్రమన కృత్తికా దీపము వెలిగిస్తారు. ఇండ్లలో పూర్ణిమనాడు దీపాలు పెడతారు. కృత్తికానక్షత్రము సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనకు ముఖ్యమైనది. మరొక విశేషం, ఏమంటే – శివాలయంలోను, విష్ణ్వాలయంలోను కూడా చేసే ఉత్సవము – కృత్తికానక్షత్ర దీపోత్సవము ఒక్కటే.
అణ్ణామలై దీపము:
చాలా దూరంలో ఉండేవారికి కూడ తెలిసేరీతిని పెద్ద గోపురమువలె చెత్తచెదారము వేసి మంట వేస్తారు. ఆలయములో నుండి ఈశ్వరుని ఆవాహనచేసిన ఒక దీపాన్ని తెచ్చి దీనిని తగులబెట్టుతారు. తిరువణ్ణామలైలో పర్వతశిఖరముపై – అణ్ణామలై దీపమని- మైళ్ళకొలది తెలిసే రీతిగా – దీపము వెలిగిస్తారు.
శ్లోకము:
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః|
దృష్ట్యా ప్రదీపం నర జన్మభాగినః భవన్తి త్యం శ్వవచాహి విప్రాః||
తాత్పర్యము:
ఈ దీపకాంతి ప్రసరించిన మానవులు, పశువులు, పక్షులు, కీటకములు అన్నీ తమ పాపాలను పొగొట్టుకొని క్షేమంగా ఉండాలి అని ఈ శ్లోక తాత్పర్యము.
ఈ మాసంలో ఆవునేతితో దీపారాధన చేస్తే మంచిదంటుంది కార్తీక పురాణం. ఒకవేళ ఆవునేయిని ఉపయోగించే శక్తి లేకపోతే నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతోగానీ,ఏదీ కుదరకపోతే ఆముదంతో కానీ దీపారాధన చేయవచ్చునని చెబుతోంది. నువ్వుల నూనె, ఆముదం, ఆవునెయ్యి... ఈ మూడు ద్రవాలూ కూడా సాంద్రతని ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటిని వెలిగించిన దీపాలు ఎక్కువసేపు వెలుగులు చిమ్ముతాయి.
సర్వేజనా సుఖినోభవంతు:
‘సకలము క్షేమముగా ఉండాలి’ అని మనము ప్రార్థన చెయ్యాలి. మనము మాత్రము క్షేమము ఉంటే చాలదు. ‘లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ అని అన్ని లోకాల సుఖము కూడ కోరాలి.
Thank you 🙏
✍️Bhagyamati.
Comments
Post a Comment